My Blog List

Sunday, March 21, 2010

నా గురించి

                       నా పేరు తాతా రమేశ్ బాబు.ఇందులో విశేషమేమి లేదు కానీ మా ఇంటి పేరు 'తాతా' అని వుండటం ,అది వినగానే ఎదుట వారి మొహం లో నవ్వు పూయటం-నా చిన్న నాటి నుండి గమనిస్తూనే వున్నాను. నేను గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామం లో పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జనవరి నెల పదిహేను వ తారీఖున పుట్టానట.మా నాన్న పేరు బసవలింగం ,అమ్మ పేరు బోలెం లక్ష్మి నరసమ్మ . మా అమ్మ గారి వూరు కృష్ణాజిల్లా దివితాలుకా, లక్ష్మీపురం . మా నాన్న విద్యా శాఖ లో పాటశాలల తనిఖి అధికారిగా వుద్యోగిస్తున్డటం వల్ల నా బాల్యం అంతా కృష్ణా జిల్లా లోనే గడచింది. వుయ్యూరు,కైకలూరు,మొవ్వ,అవనిగడ్డ లలో తొమ్మిదవ తరగతి వరకూ చదువుకున్నాను. ఆ బాల్యం నా జీవితం లో మరపు రాని ఒక అందమైన పూలతోట.పదవతరగతి మచిలీపట్టణం జైహింద్ హై స్కూల్ లో నూ,ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ లను ఆంధ్ర జాతీయ కళాశాల లోనూ చదువుకున్నాను. డిగ్రీ ఆఖరి సంవ్వత్సరం లో వుండగా మద్రాసు సిని పరిశ్రమ కు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా వెల్లవలసి వచ్చింది. అందువల్ల డిగ్రీ పూర్తి చేయలేఖ పోయాను.
            నాకు చిన్ననాటి నుండి లలిత కళలు అన్నా,ఆటలు అన్నా చాలా ఇష్టం.
           ఆంధ్ర జాతీయ కళాశాలలో వున్నప్పుడు హాకి,ఫుట్ బాల్,బాస్కెట్ బాల్,ఆటలే కాక పరుగు,పోల్వాల్ట్, మొదలైన ఆటలు ఇష్టం గా ఆడేవాడి ని .కృష్ణా జిల్లా బాస్కెట్ బాల్ టీం లో ఆడాను.ఇంటర్ కాలేజీ హాకీ లో ఆంధ్ర యూనివెర్సిటీ పోటిలలోరన్నర్ అప్ టీం లో వున్నాను. హాకీ ఆడటం లో నేను ప్రత్యేక శైలి లో ఉండేవాడిని.ఆ తర్వాత ఆటలు ఆడటం మానేసాను.
            నా పదవతరగతి నుంచే గేయాలురాయటం ,నాటకాలు వేయటం మొదలు పెట్టాను.నా రచనలు చాలా దిన ,వార పత్రికలలో ప్రచురించ బడేవి. ప్రచురించబడిన నా పుస్తకాలు,అణువు పగిలింది (కవిత్వం),పిడికిలి (దీర్ఘ కవిత),తాతా రమేశ్ బాబు కథలు,విప్లవరుతువు(కవిత్వం),తోలిగీతలు,దిద్దు బాటు(బొమ్మలాట),తయారు చేద్దాం(క్రాఫ్ట్ వర్క్),అసలు నిజాం(బొమ్మలాట),నాన్నో పులి (బొమ్మలాట),బొమ్మలాట (బొమ్మలు తయారు చేసి ఆడించటం),శుభాకాంక్షలు(అభినందన పత్రాలు),లయ (ఆకాహవానిసమిక్షలు ) ,నా దేశం (దీర్ఘ కవిత),తాతా రమేశ్ బాబు చిత్రకళ,బాలభందు బివి జీవిత చరిత్ర.
            రెండు వేల అయిదవ సంవత్సరం లో మచిలీపట్టణం నుండి వెలువడిన 'జనప్రభ' సాహిత్యమాస పత్రిక కు సంపాదకుడిగా వ్యవహరించాను. రెండువేల ఆరవ సంవత్సరం లో జాతీయ తెలుగు రచయితల మహాసభలకు ముఖ కార్యకర్త గా సేవలను అందించటమే కాక,ఆంధ్ర ప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపధ్యం లో యాభై ఏళ్ళ తెలుగు భాష ,సంస్కృతి, సాహిత్య వికాసాల సమీక్షా గా వెలువడిన నూట పన్నెండు వ్యాసాల వ్యాసాల సంకలనం 'తెలుగు పసిడి' గ్రంధానికి ఉప సంపాదకుని గా వున్నాను.అలాగే రెండువేల ఏడు సంవత్సరం లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ముఖ్య కార్య కర్త గా సేవలను అందిస్తూ,భారత స్వాతంత్ర వజ్రోత్సవాల నేపధ్యం లో వివిధ రంగాలలో తెలుగు వారి అరవై ఏళ్ళ ప్రగతి సమీక్ష గా రెండు వంద్దల పదమూడు వ్యాసాల సంకలనం 'వజ్ర భారతి ' వుద్గ్రందానికి సంపాదక వర్గం లో వున్నాను.
             ఇక రంగస్థలం మీద ఫలించని వంచెన నాటిక లో కథానాయిక గా,ఏక్ దిన కా సుల్తాన్ లో మీసాల వెంకటరత్నం గా మనుషులోస్తున్నారు జాగ్రత్త లో రెడ్డి గా ,క్రాంతి లో రామారావు గా ,ది ఇంసిడెంట్ లో బ్రాహ్మణుడు గా ,తాకట్టు లో జ్ఞానేశ్ గ,కీర్తిశేషులు నాటకం లో మురారి గా,-ఆకాశవాణి,విజయవాడ కేంద్రం లో రాంబాబు కాపరం లో రాంబాబు గా ,జాతీయ నాటకం నాదయోగి లో రామరాయుడి గా ,అపూర్వ నరకం లో తమిళ అయ్యర్ గా,-హైదరాబాద్ దూరదర్శన్ లో మొదటికే మోసం బొమ్మాలాట లో పప్పెట్ గా ,సంసారం సాగరం మెగా సీరియల్ లో మంత్రగాడుగా, మినీ మూవీ లో గంగిరెడ్డి గా, లయ సీరియల్ లో వెంకట రావు గా,అబ్బాయి ప్రేమలో పడ్డాడు చలన చిత్రం లో గుండు అనుచరుడు గా , నటించటం జరిగింది.
           ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి ,తొలి రంగుల సినిమా బొమ్మలాట నూ వివిధ భారతి లో ఇవ్వటం ,పగటి వేషాలు,సామాజిక ప్రయోజనం అనే అంశం మీద మూడు వారాల ధారావాహిక ప్రసంగాలు,గుడివాడ నాటక రంగం మీద మూడు వారాల ప్రసంగాలు ఇచ్చాను.
           అంతర్జాతీయ సంస్థ ఆర్ధిక సమతా మండలి,శ్రీకాకుళం లో అయిదు సంవస్త్సరాలుగా కొన్ని వందల మంది బాల బాలికలకు ,అంగన్వాడి కార్యకర్తలకు ,ఒరగామి,నమూనాలు తయారు చేయటం,స్క్రీన్ ప్రింటింగ్,మొదలయిన అనేక కళల లో సృజనాత్మక శిక్షణ ఇస్తున్నాను.
అయిదు లక్షల కు పైగా అభినందన పత్రాలు,సూక్ష్మ చిత్రాలు,నిటి తైల వర్ణ చిత్రాలు చిత్రించాను.
           గుడివాడ పురపాలక సంఘ పాటశాల అయిన అడుసుమిల్లి గోపాల కృష్ణయ్య పురపాలక ఉన్నత పాటశాల లో చిత్ర కల ఉపాధ్యాయుని గా పంతొమ్మిది వందల ఎనభై అయిదు నుండి పని చేయు చున్నాను.



 నేను    పదవతరగతి లో     వున్నపుడు




నేను    డిగ్రీ    చదువుతున్నపుడు







1 comment:

  1. maddiraala vaari kandam

    కం. అనితర సాధ్యుడు, కళలకు
    తన సేవలొసగి, కళామతల్లికి బిడ్డై,
    తనదగు శైలిన పరులకు
    సాయంబునిడెడి ఘనుడే తాతా!

    ReplyDelete