My Blog List

Tuesday, December 7, 2010

బుడబుక్కల వేషం(పగటి వేషాలు)

బుడబుక్కల వేషం
'బుడ....బుడ.... బుడబుడ.....బుడబుక్...'
అనే ఢమరుక శబ్దం ,మధ్యలో ఘంటా నాదం,గంభీరమయిన కంటఃస్వరం తో ........
రాగ యుక్త కీర్తనల తో ......'

ఆ ప్రదేశం గ్రామమే ! ఆ కాలం సంక్రాంతి కాలమే!
ఆ వచ్చింది బుడబుక్కల వారే!
పండిన పంటలతో గ్రామాలలో ఇళ్ళు కళకళలాడాలని , గ్రామం సుభిక్షంగా వుండాలని, ఆశిస్తారు బుడబుక్కల వారు.అలాగే బుడబుక్కల వారు తమ గ్రామానికి వస్తే శుభప్రదమని భావిస్తారు పల్లెవాసులు.
చేతిలో ఢమరుకం ,నడుముకు ఘంట ,భుజాన జోలె, నల్ల కోటు వేసుకుని ఆపై శాలువా ధరించి,ఎర్రని తలపాగా చుట్టుకొని ,నల్లటి గొడుగు తో కనిపిస్తారు బుడబుక్కల వారు.తెల్ల వారు ఝామునే భిక్షాటన ముగించాలనేది వీరి సాంప్రదాయం.
పల్లెల్లో ఇల్లాళ్ళు తెల్లవారు ఝామునే లేచి ,వాకిట్లో కళ్లాపి జల్లి ,అందమైన ముగ్గులతో అలంకరించే వేళ
'అంబ పల్కు..జగదంబ పల్కు..' అంటూ వచ్చే బుడబుక్కల వారి ఆశిస్సులు తీసుకుని, భిక్ష వేస్తారు .మగవాళ్ళు గేదలదగ్గర శుభ్రం చేస్తూ , పండిన పంట తాలూకు ఆలోచనలు చెస్తూ ,చేయబోయే పనుల గురించి ,ఇంటికి కావలసిన అవసరాల గురించి ,కొనబోయే వస్తువుల గురించి,కొత్త అల్లుళ్ళ గురించి ....రకరకాల పధకాలు వేస్తూ వుంటారు.
తాము వచ్చిన ప్రదేశం లో ఏ వైపు ఈతి భాదలు వుంటాయో చెప్పి,నివారణ ఉపాయాలు ప్రజలకు తెలియ చేసి ధైర్యం చెపుతూ ముందుకు సాగుతారు బుడబుక్కల వారు. ఇది వీరి కుల వృత్తి . వీరి కులం 'బుడబుక్కల' . వీరు సంచార జీవులు. ఏ గ్రామం వెళితే ,అ గ్రామ కుమ్మరుల ఇళ్ళ దగ్గరే ఉండి, భోజనం కూడా వాళ్ళ దగ్గరే చేస్తారు. సంచార జీవులైన వీరిని ఎస్టీ లలో కలప లేదు ప్రభుత్వం.
స్వాతంత్రానికి పూర్వం జమిందార్లు వీరికి భూములు ఇచ్చారు. సంక్రాంతి రోజులలో మూడు నెలలు యాచించగా వచ్చిన ధాన్యం తో జోలె నిండి పోయేది. అలా మూడు నెలల యాచనను, ఎడ్ల బండి కెత్తుకుని వెళ్ళేవారు. క్రమక్రమంగా రైతు పరిస్థితి దిగజారడంతో ,యాచన లేక భుక్తి గడవటం ఇబ్బందిగా ఉండి,కుల వ్రుత్తి ని పక్కన పెట్టి కూలీలుగా,పాట బట్టలు అమ్మే వారుగా కాలం గడుపుతున్నారు.
మన రాష్ట్రం లో వీరి సమాఖ్య పడి లక్షలకు పైగానే వుంది. కాని వీరికి రాజకీయాలలో ప్రాతినిధ్యం లేదు.అనంత పురం,జహీరాబాద్,ఆమ్తోల్,కరీంనగర్,వరంగల్ జిల్లా లలో ,ఖమ్మం అన్ని మండలాలలో వీరు ఎక్కువగా వున్నారు. 'బుడబుక్కల కబుర్లోద్దు',ఒరే బుడబుక్కలోడా','వీడొక బుడబుక్కలోడు' లాంటి పిలుపులతో తక్కువ భావం తో తిట్టుగా మారిన వీరి కులం పేరు మార్చాలని ప్రయత్నం జరుగుతోంది. ఖమ్మం ప్రాంతాల వారు,'రాజ క్షతియ','జ్ఞానేశ్వర్' అనే పేర్లు సూచించారు. వీరికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సాయాలు అందాలని బుడబుక్కల సంఘం అధ్యక్షుడు,చంద్ర శేఖర్, యుత్ వెల్ ఫేర్ ప్రసిడెంట్ రాములు కృషి చేస్తున్నారు.



పగటి వేషాల వారి ప్రదర్శన





పగటి వేషాల వారు బుడబుక్కల వేషాన్ని కాదు రమ్యం గా ప్రదర్శిస్తారు . ఢ మరుకం 'బుడబుడ...' అంటుంది కాబట్టి వీరు ఈ వేషాన్ని బుడ బుడకల వేషం అని పిలుస్తారు. ఈ వేషాన్ని ఇద్దరు,లేక ఐదుగురు ప్రదర్శిస్తారు. అమ్దరికీ సంప్రదాయక వస్త్రాలుం టాయి . పంచే ,లాల్చీ,లాయరు కోటు,పైన శాలువా,పెద్దపెద్ద మీసాలు పెట్టుకుంటారు. నుదుటన పసుపు బొట్లు అడ్డంగా పెట్టి ,ఆపైన ఎరుపు బొట్టు రూపాయి బిల్లంత సైజు పెట్టుకొని,గడ్డం మీద నుండి తల పైకి వచ్చేట్లుగా ఎర్ర రంగు గుడ్డ చుట్టూ కుంటారు. మేడలో రుద్రాక్ష మాలలు,చేతికి కడియాలు,కాలికి గగ్గేరలు తొడుక్కుం టారు. ఇంతకు ముందు గ్రామ పెద్దలు బహుకరించిన సింహ తలాటాలు,మెడల్స్ తో అలంకరించు కుంటారు. ఘంటా కంకణం ,మకర కుండలాలు ధరించి గ్రామం లోకి అడుగు పెడతారు.
ముందుగా ఆ వూరి పోలేరమ్మను ,ఆ వూరి పెద్దలను అందరిని తలచుకొని ,అక్కడ 'వురికట్టు ' ఏర్పాటు చేసుకొంటారు. అమ్మవారికి మ్రొక్కి ,ప్రార్థించి ,కోడిని బలి ఇచ్చి ,ఈ వేషాన్ని ఊరంతా ప్రదర్శిస్తారు. ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టి మధ్యాన్నం రెండు గంటల దాకా ప్రదర్శిస్తారు. ఐదుగురు వేష గాళ్ళ లో ఒకరు బుడబుక్ వాయిస్తే, ఒకరు చేతిలో గజ్జెలు,ఒకరు గంట,ఒకరు డప్పు,మరొకరి చేతిలో భిక్ష పాత్ర వుంటుంది.
' అంబ రావే...జగ డంబ రావే.... -బుడబుక్
కంబ కంటిని .... కాళి రావే ....-బుడబుక్ '
అయ్యలారా...అమ్మలారా... ఈ రోజు వేషం బుడబుక్కలు. బుడబుక్కలు చెప్పే మాటలు దేవతలా ముచ్చట్లు .
' కాశి విశాలాక్షి పల్కు ...కంచి కామాక్షి పల్కు...-బుడబుక్
కలకత్తా కాళి పల్కు.....మధుర మీనాక్షి పల్కు...-బుడబుక్
ఆ కొండపై వెలసిన విజయవాడ దుర్గమ్మ పల్కు...'

మేం ఇప్పుడు పుట్టినోల్లం కాదు మారాజా. " కృతయుగం లో శ్రీ హరి బుడబుక్కల వాని ఏసం ఏసి శివునికి త్రిపురసురల సంహరించే ఉపాయం జోస్యం చెప్పినాడు మారాజ్ ! త్రేతాయుగం లో డంభికాసురుడనే రాక్ష సుడిని చంపి వాని డింభం డోలక ఢ మరుకం చేసి ,వాని నరము తాళ్ళుగా,చర్మం మూతలుగ, చేసి బుడబుక్కల వాని వేషం లో వచ్చి ,సూర్య వంశం గురించి చెప్పి ,ఢ మరుకం వాయించిన మేము ఇప్పుడు ఇల్లిల్లు తిరిగి దీవిచి పోతున్నాం మా రాజ్ . త్రేతాయుగంలో దశరద మహారాజు సంతానం లేకుండా చింతిస్తున్న సమయం లో శ్రీ మహా విష్ణువు ,బాగా యాలోచన చేసి ,రఘు వంశం ఇంతటితో ఆగి పోరాదు,దశరధుని నిరాశను ఆశ గా చిగురింప చేయాలని ఒక రోజు బుడ బుక్కల వాని వేషం లో వచ్చి.......' రాజా,రాజాధిరాజ ,రాజ మార్తండ, రవి కల్ప భోజ ,రాజ,నీకు భవిష్యత్తు చాల ఉండ్య. సంతానం లేదని చింత పద వద్దు. నువ్వు వీరుడివి,శురిడివి, అమాత్యుడివి, కాబట్టి నీకు పుత్ర సంతానం కావాలనే ఆలోచన వుంది. అందుకు చక్కని పధకం చెబుతాను విను' అన్నాడు. అంతవరకు ఎంతో చింతిస్తున్న దశరధుడు నిరస నిస్పృహలను వదలి పెట్టి ,భవిష్యత్తు మీద ఆలోచనతో ,ఆశతో 'చెప్పండి' అన్నాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు 'పుత్రకామేష్టి' యాగాన్ని చేస్తే, తప్పకుండా నీకు పుత్రులు జన్మిస్తారు'అని చెప్పాడు. అలా పుట్టిన మేము ఇప్పడు గ్రామా గ్రామాన తిరిగి మంచి విషయాలు,దేవతలా ముచ్చట్లు తెలుపుతూ వుంటం.
తమ వంటి దాతలు ఉన్నంత కాలం ఈ దేశానికి ,ఈ భూమికి మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం మా సేతు గారికి లక్షల లక్షల లాభం కలిగి ,శుభోజ్జయం కలిగి,బుడబుక్క ల వారి ఆశీస్సులు గలిగి ,...ఎల్లప్పుడూ జయాన్ని పొందాలి....జయీ భవ..... విజయీ భవ.... దిగ్విజయీ భవ .......
'అంబ పల్కు...జగదంబ పల్కు.....-బుడబుక్
బంబర వేణి పల్కు....బకల ముఖి పల్కు....-బుడబుక్ '





సామాజిక అంశం:


వ్యవసాయంలో పంట దిగుబడి తగ్గి బాధ పడే రైతులు ,అనేక సమస్యలతో నిరాశ చెంది జీవితంపై విరక్తి చెందుతున్నారు .


ఆర్థికంగా ,శారీరకంగా,మానసికంగా, బాధలలో ఉన్న వారందరిని నిరాశకు లోను కావద్దు, భవిష్యత్తు లో బాగుంటుందని చిగురించే ఆశలు కలిగిస్తున్నారు ఈ వేషం ద్వారా . ప్రస్తుతం బాధల నుండి విముక్తి పొందటానికి చేయవలసిన పనుల గురించి ఆలోచించి,ఆచరణలో పెట్టటమే తక్షణ మార్గం , పరిష్కారమని ప్రజలకు చెప్తారు.


విజయం సాధించాలంటే అసంతృప్తి ,అసహనం,మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి .సమాజంలో అన్ని వర్గాలతో సత్సంబందాలు నెలకొల్పుకోవటం ద్వారా ,సానుకూల దృక్పధాన్ని అలవరచి కోవాలి. పరిపరి విధాల పోయే మనసును సానుకూల దృక్పధం వైపుకు మరల్చమని చెప్పేదే ఈ వేషం .
నేడు ప్రజలకు భవిష్యత్ మీద నమ్మకం కలిగించే మాటలు చెప్పటానికి మానసిక వైద్యులు ,సానుకూల ఆలోచన తరగతులు నిర్వహించే వారు కృషి చేస్తున్నారు.





-తాతా రమేశ్ బాబు,
గౌరవ అధ్యక్షులు : కళా భారతి,
సాంప్రదాయ జానపద కళాకారుల సంక్షేమ సంఘం ,రిజి.429 /2009
బిళ్ళపాడు

Sunday, August 15, 2010

త్రిపురనేని శ్రీనివాస్ జ్ఞాపకాలు

మనిషి ని తోటి మనిషి దోచుకొనే దోపిడీ వ్యవస్థను మా తరం తోనే అంత మొందించాలనే ఆకాంక్ష తో ,సామాజిక చైతన్యానికి సహకారిగా, "జనప్రభ " సాహిత్య మాస పత్రికను పంతొమ్మిది వందల ఎనభై ఐదు ,జనవరి నెలలో ప్రారంభించాం . "జనప్రభ" సంపాదకుడు గా నేను ,అనగా తాతా రమేశ్ బాబు ను వున్నాను .


" త్రిపురనేని శ్రీనివాస్" అనే యువకుడు ,తన కవితలు ,కథలు ప్రచురించి ,ప్రోత్సహించమని ,నాకు ఉత్తరాలు రాసేవాడు. రచనా స్థాయి ప్రాధమిక దశలొ కాబట్టి ,"మార్పులు చేర్పులు చేయాల్సిన అవసర ముంటే చేయ "మనే ఉత్తరాన్ని ,అయన దగ్గర నుండి తీసుకుని ,విషయం చెడ కుండా సంస్కరించి ప్రచురించాను. ప్రారంభించిన ౩ వ నెలలో "కార్మిక వృక్షాలు " అనే వచన కవితను,మే నెల సంచికలో "కాగితం పులి "["చిత్తూర్ జిల్లా లోని ఒక పల్లెలో వాస్తవం గా జరిగిన కథకు అయన శక్తి మేరకు ,కల్పితాల వ్యక్తుల పేర్లతో పంపిన కథ ను నాలుగు సార్లు తిరగ రాసి ] అనే కథను ప్రచురించాను


కాగా ,అదే సం. నవంబరు ఇరవై మూడవ తేదిన ఒక వుత్తరం రాసాడు .క్రింద చూడండి....


తా.ర.గారికి [తాతా రమేశ్ లో మొదటి అక్షరాల]


నేను అరెస్ట్ అయి జైల్లో వున్నపుడు మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళారని మా తమ్ముడు చెప్పాడు. మిమ్మల్ని కలవ లేక పోయి నందుకు చాలా విచార పడ్డాను.


నన్ను జూన్ పదిహేనవ తేదిన అరెస్ట్ చేసి పద్దెనిమిది న రిమాండు కు పంపారు. మూడు నెలలు వాయిల్పాడు సబ్ జైలు లోను ,రెండు నెలలు చిత్తూరు గ్రేడ్ -రెండు జైలు లోను వున్నాను .పూర్తిగా ఐదు నెలలు వున్న తర్వాత ఈ నెల పదిహేడు న రిలీజ్ అయ్యాను. కండిషనల్ బెయిల్ మీద ప్రస్తుతం రోజుకు రెండు సార్లు పోలిస్ స్టేషన్ లో సంతకం పెడుతూ తిరుపతి లోనే వున్నాను. నా మీద హత్యా,బాంబులు,కత్తులు ,తుపాకులు,కేసు పెట్టారు. ఈ జిల్లా లో కలికిరి సమితి ప్రసిడెంట్ మల్రెడ్డి అనే భూస్వామి ని ,నేను మరో పడి మంది కలసి హత్య చేసినట్లు కథనం. అతను పొయినా సం. ఏప్రిల్ నెలలో పీపుల్స్ వార్ పార్టి చేత హత్య చేయ బడ్డాడు .నేను పాల్గొనక పోయినా ఒక క్రూర భూస్వామి ని హత్యాచేసిన అభి యోగం నా మీద మోపి నందుకు గర్విస్తున్నాను. విప్లవం లో ఇటు వంటి నిర్భందకాండ మాములేగా.


జైల్లో నేను రాసిన ఒక కవిత ను జనప్రభ లో ప్రచురణకు పంపుతున్నాను . ప్రచురించ గలరని ఆశిస్తూ న్నను. పత్రికలూ పంపుతూ వుండండి. త్వరలో చందా పంపిస్తాను.


ప్రస్తుతం రాష్ట్రం లో విప్ల వోద్యమం మీద నిర్భంద కాండ చాలా ఎక్కువ గానే వుంది.ఇలాంటి సమయాల లోనే రచయితల బాధ్యతా ఎక్కువగా వుంటుంది. ఆ భాద్యత ను ,మీ వంతు కర్తవ్యంగా మీరు జనప్రభ ద్వారా నేర వేర్చ గలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. వెంటనే వుత్తరం వ్రాయండి.


మీ


త్రిపురనేని శ్రీనివాస్



పై ఉత్తరానికి సమాధానం గా , "మనుషుల మనసులను మంచి మార్పు కోరే చైతన్యదీప్తులు గా వెలిగించతమే నా లక్ష్యం "అని రాసాను.


ఆ తరవాత వేగుల ద్వారా శ్రీనివాస్ చేస్తున్న రక రకాల ప్రయాణాల గురించి తెలుసుకుంటుననపుడు ఏడుగు తున్నాడో ,దిగ జారుతున్నాడో అర్థమయ్యేది కాదు.


"ఆంద్ర జ్యోతి " వార పత్రిక సంపాదకుడు గా వెనుక బడిన వాడ ,దళితవాడ ,స్త్రీ వాడ లను ,పత్రిక లో ప్రముఖం గా చర్చ కు పెట్టాడు. కాగా ఆయా చర్చల వల్ల ఈ వాదాలు జనాలను కలిపాయో ,చీల్చతానికి పనికి వచ్చాయో తెలియదు కాని,అందరు హాయిగా మాట్లాడుకునే పరిస్థితి పోయింది . తెలంగాణావాదం లాంటివి మొదలు అవుతున్న దశలో athanu మరణించాడు. ఆ తరువాతి కాలంలో నన్ను చూసినా ,నేను పలకరించే ప్రయత్నం చేసినా ,తన స్థాయి చాలా గొప్పదన్నట్లు ప్రవర్తిం చేవాడు. రాస్తున్న కవిత్వానికి ,ఆచరణకి అబెధం చూపాలని ప్రయత్ని స్తున్నపుడు ,- నీచ ,స్వార్థ,సంకుచిత,ప్రయోజనాలు కలిగిన ,అన్ని రకాల ప్రజాపార్టీ లా పేరుతొ వున్న, వాటి అనుభంద సంస్థలలో వున్న వ్యక్తులు నన్ను అనేక ఇబ్బందులు గురిచేసి నప్పుడు ,మొక్కవోని ఆత్మ విశ్వాసం తో నిలబదినపుడు, జి.శ్రీరామా మూర్తి గా బ్రతుకుతూ,కవిగా చచ్చి పొయినా 'నిజం' ,' ఎన్ని దుష్ట శక్తులు,మరిన్ని ప్రజా వ్యతిరేక శక్తులు ,ఎన్నెన్ని పన్నాగాలతో ,ప్రలోభాలతో ,ప్రజభ్య్దయ ప్రభాకరులను హరించి వేసినా, నీ వంటి ఉదయారుణ కిరణాలను మాత్రం నిశ్శేషం చేయజాలవు. నిజాయితీ,ప్రజా నిబద్ధత ,నీలో చావా నంత కాలం నీ అక్షరాలూ నిప్పురవ్వలు .రివిజినిజం,రాజీతనపు చెదలు వాటి దరిచేరవు " అని' పెన్ను' చరిచి దన్ను గా నిలిపాడు.


ఆ తరవాత త్రిపురనేని శ్రీనివాస్ ప్రముఖ వెండి తేరా దర్శకుడు రాంగోపాల్ వర్మ తో కలసి సినిమా కుడా తీస్తున్నాడని ,వింటున్న దశలోనే ,aa charchala'మత్తుగా " దుర్మరణం చెందాడని విన్నాను.

Saturday, August 14, 2010

రాంబాబు కాపరం

నమస్కారం .నేను రాంబాబు గా నటించిన హాస్య నాటిక , 'రాంబాబు కాపరం" అనే రేడియో నాటిక లింకు పంపుతున్నాను. రచన : అద్దేపల్లి భరత్ కుమార్ , నిర్వహణ : ఎలిసెల నాగేశ్వర రావు , పాత్రలు :రాంబాబు : తాతా రమేశ్ బాబు ,సీత : వి.ఎస్.,రత్నమాల ,వానర మూర్తి : డి. నాగేశ్వర రావు, సింగినాథం ; పఠాన్ చందు ఖాన్ .ఈ నాటిక ఫిబ్రవరి 2 ,2008 రాత్రి 9 .30 నుండి 10 వరకు -ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్మించి ప్రసారం చేసింది.
లింకు : http://www.mediafire.com/?f9xcq56wta162tu
విని మీ అభిప్రాయాన్ని తెలుపు తారని ఆశిస్తూ ........

Tuesday, May 18, 2010

కవిత్వ "మంటే"?

కవిత్వమంటే .....
కొంతమందికి బాగా బోంచేసినట్టు
కొంతమందికి కళ్ళు జ్వలిస్తున్నట్టు
కొంతమందికి అస్థికలు,బొమికలు ,వేపమండలు కనపడుతున్నట్టు
కొంతమందికి డిటెక్టివ్ లు ,సెక్స్ బాంబు లు కనపడుతున్నట్టు
కొంతమందికి కులాలు ,స్త్రీలు ,మైనార్టీలు కనబడుతున్నట్టుగా వుంది.
సరే ,ఎవరి దృక్పథాలు వారికి వుంటాయి .
అయితే,ముందు నువ్వు రాజకీయం చెప్పినా ,మరేదయినా చెప్పినా ,కవిత్వమంటే కవిత్వంగా వుండాలి . అంటే ఆ రాసినది ఖచ్చితంగా కవిత్వమై వుండాలి .

ఏది కవిత్వం?

ఫలానాది కవిత్వం,ఫలానాది కవిత్వం కాదు అని చెప్పటానికి వైమర్శిక కొలత బద్దలు లేవు . అందువల్ల కవిత్వాన్ని చదివే పాఠకుడి యొక్క సంస్కారం మీద ఆ కవితా స్థాయి ఆధార పడి వుంటుంది . అంటే చదివేటటువంటి వారి హృదయం ,ఏది చదివితే చలిస్తుందో అది ఉత్తమ కవిత్వం . ఏది చదివితే హృదయం పాషాణ ప్రాయమై పోయిందో , కదల కుండా -అది చెత్త కవిత్వమని తేల్చేయ వచ్చు .
కవి అవటానికి ,కాక పోవటానికి ,సమాజానికి పనికి వచ్చే కవిత్వానికి పనికి రాకుండా పోయే కవిత్వానికి తేడా వుంది .ప్రధానం గా మనం చూడ వలసినది కవి అవునా? కాదా?
దీనికి ఏమిటి ఆధారం ?
వ్రాసిన కవిత్వమే దీనికి ఆధారం.
ఆ తరువాత ఆలోచించాలి .ఆ కవిత్వం మనకు పనికి వస్తుందా? అని.

ఇవాళ మనని వేధిస్తున్న సమస్య ఏమిటంటే , వస్తువు నుండి మనం కవిత్వం చూస్తున్నాం ,చూడవలసిందే . ఇప్పుడు సంప్రదాయకులు ,ఆధునికులు కూడ అలాగే చూస్తున్నారు .పూర్వ అలంకారికులు 'రసధ్వని కావ్యాత్మకం ' అన్నారు. అయితే ,ఆధునికులు ఏమి చెబుతున్నారంటే ,ఆనాడు కావ్యానికి శిల్పం ప్రాణ మైంది . ఈనాడు కావ్యానికి వస్తువు ప్రాణంగా నిలిచింది ......ఇలా భారత దేశం లో వచ్చిన విమర్శకు లందరూ ఎవరికీ తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు.
ఇవాళ వున్న విమర్శకులలో చాలా మంది వస్తువుకే ప్రాధాన్య మిచ్చి ,వస్తువును ఆధారంగా చేసుకుని కవి అవునా కాదా అనేది నిర్ణయిస్తున్నారు .ఇదే సిద్ధాంతం పునాదిగా వచ్చినటువంటి వాళ్ళలో శిల్పాన్ని విస్మరించటం శోచనీయం .
ఒకప్పటి రష్యా లోని ప్రముఖ విమర్శకుడు 'లూనా చేరస్కి ' . ఆయన మేధావి కూడా. రష్యా పోరాట చరిత్ర లో వున్న విజయాలు ,అపజయాలు తెలిసిన వ్యక్తి . జార్ చక్రవర్తుల క్రింద ప్రజలు పడినటువంటి వేదన అవగాహన ఉంది. అయన ఏమి చెప్పాడంటే, "కవి గాని,రచయిత గాని చెప్పదలచుకున్న భావం ఎ రాజకీయ నాయకుడైనా చెప్పగలడు,తన ఉపన్యాసం ద్వారా. కాని సాహిత్యానికి ,రాజకీయ నాయకుడి కంటే ప్రజల హృదయాలను ప్రభావితం చేసే శక్తీ ఎక్కువ వుంటుంది ,కనుక కవిత్వాన్ని చదివెట్టువంటి వారి హృదయాన్ని ప్రభావితం చేయాలి అంటే ఎ రచన అయినా శిల్ప సహితంగా వుండాలి కాని, శిల్ప రహితంగా , ఉత్త నినాదంగా ఉండకూడదు" అని. ఒక మార్క్సిస్టు విమర్శకుడికి ఉండ వలసిన ప్రాధాన్యం ఏమిటో ఆతను చెప్పుకొస్తూ పై విషయాన్ని వ్రాసాడని కీ.శే. టి.ఎల్. కాంతారావు అన్నారు.
ఆ తరువాత రచయిత చెప్పదలచు కొన్నది -ప్రధానంగా కవి దృక్పధం. ఎవరి కోసం చెబుతున్నాడు ? ఎందుకోసం చెబుతున్నాడు ? మొదటి ప్రశ్నకు సమాధానమే ఆ రచయిత యొక్క రచనా శిల్ప స్థాయి ఆధారపడి వుంటుంది . ఎందు కంటే , విశ్వనాధ ని కవి కాదన్న వాళ్ళు వున్నారు . గురజాడ ని కవి కాదన్న వాళ్ళు వున్నారు . శ్రీ శ్రీ కవిత్వమంతా చెత్త కవిత్వం అన్న వాళ్ళు వున్నారు . ఎందుకు కవి కాదంటున్నారు ? ఫలానా వాడు కవి అవును అనడానికి కేవలం వస్తువు పునాది అవుతుందా?
సాహిత్యంలో ఇది మంచిది కాదు.
అయితే , విశ్వనాథ వారు ఈ సమాజానికి ,ఈ కాలానికి ఎంత మాత్రమూ పంకిరాని కవి అని నిర్మోహ మాటంగా చెప్పవచ్చు . ఇది వాస్తవం ,అయినా ఆయన కవి కాకుండా పోడు. అలాగే గురజాడ అప్పారావు గారు వీళ్ళ కొలమానాల్లో చూస్తే కన్యాశుల్కం లో హీరోయిన్ ఎవరు? హీరో ఎవరు? ఇందులోన రసము ఏమిటి? ఇవన్ని ఆలోచించి గురజాడ ను కవి కాకుండా చేయటానికి అకవి అనే పదం ఆనాడు సృష్టించారు. ఆ సృష్టి లో పొట్ల పల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు పాల్గొని గురజాడ మీద కావలసినంత దుమ్ము చల్లారు .చిత్ర మేమిటంటే ,కొందరి నిర్ణయాలతో ఎ కవులూ చావరు. అలాగే ఎ నిర్ణయాలతో కవులు బతకరు. అక్కిరాజు ఉమా కాంతం గారు భావ కవులందరిని దుమ్మెత్తి పోయాలనే ఉద్దేశ్యంతో నేటి కాలపు కవిత అనే పుస్తకం రాసారు. కాని సాహిత్య చరిత్ర ఇప్పటికి రుజువు చేసిన సత్యం ఏమిటంటే ,నేటి కాలపు కవిత అనే పుస్తకం చచ్చి పోయింది . ఆ పుస్తకం లో ఎ కవులయితే పనికి రారని రాసారో ఆ కవులందరూ,వాళ్ళు చచ్చి పోయినప్పటికీ ,వాళ్ళ కవిత్వం జీవించే వుంది. అందుకే నిజంగా కవి అయిన వారిని ఎవరూ చంపలేరు. కవి కాని వాడ్ని ఉపన్యాసాలతో పొగడ్తలతో ఎవరూ జీవింప చేయలేరు. ఇది నిజము. అందుకనే దుష్ట విమర్శలు దుష్ట సమీక్షలు ,కవుల్ని బతికించ లేవు ,చంపలేవు. అయితే విమర్శ లన్నిటి లొనూ వస్తు దృక్పధం పూర్తిగా కనపడుతుందని స్పష్టం గా చెప్పు వచ్చు .

విశ్వనాథని కవి కాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన వ్యాకరణ దోషాలు ఉద్గ్రంధాలు గా వచ్చినా కవి గా చావలేదు. అల్లాగే త్రిపురనేని రామస్వామి మీద విమర్శల వల్ల ఆయన హేతువాదం చావలేదు.
" మనం ఆలోచించేప్పుడు నేత్రాలను,మేధస్సును పరిశుబ్రం చేసుకుని చదవటం ,ఆలోచించటం చేయక పోయినట్లయితే కవిత్వం ఎప్పుడూ అకవిత్వం గానే కనపడుతుంది. "

పద్యమే కవిత్వమా?

వచనాన్ని ఛందోబద్దం చేసినంత మాత్రాన పద్యం కాదు. పూర్వం చాలా చచ్చు విషయాలను కూడ పద్యాలలో చెప్పారంటే దానికి కొన్ని కారణాలు ఉనాయి. ఆ నాటికి సంకేతిక పెరుగుదల లేదు. కాగితం లేదు . ముద్రణా సౌలభ్యం లేదు . అందుచేత ఆనాడు వచనం వికసించలేదు . ఏది చెప్పినా సంక్షిప్తంగా వుండాలి. వచనాన్ని పేజీలకు పేజీలు గుర్తుంచుకో లేరు . అందువల్లనే ఆనాడు శాస్త్ర జ్ఞానం చెప్పినా, గణితం చెప్పినా అన్ని శ్లోకాల లోనే చెప్పారు. శ్లోకాలలో క్లుప్తత వుంది. ఆ క్లుప్తత స్పేస్ ప్రాబ్లం ని కవర్ చేస్తుంది . ఆనాడు ఎన్ని ఉద్గ్రంధాలు వచ్చినా ,అందులో కవిత్వాన్ని ఎరుకోంటే కొంతే కనపడుతుంది. కాగా కథ ప్రాధాన్యమైన గ్రంధాలు ఎక్కువ. పద్యం లోనే రాస్తేనే కవిత్వం అనే భ్రమలో ఇవాల్టికి కొంతమంది వున్నారంటే ,వీళ్ళని ఎం చేసినా మారారు.

కథాకావిత్వం

ఇవాళ కవిత్వంలో కథ అనవసరం. కథ ఒక పక్కకి వెళ్లి పోయింది . కథకు కావలసినంత మంది వున్నారు. కవిత్వంలో కథ యొక్క అవసరం లేదు. ఆనాడు భారతం కాని,రామాయణం కాని కథా ప్రధానమైన కావ్యాలు ప్రతిదీ పద్యం లోనే రాయవలసి వచ్చింది. నన్నయ్య గారి భారతం చదివిన ప్రతి వారికీ, ఇవాళ వస్తూన్న పద్యాలన్నీ దండగ అనిపిస్తుంది . వచన కవిత్వం లో కథా కావ్యాల గురించి కుందుర్తి కీ ,తిలక్ కీ మధ్య చర్చ జరిగింది. వచన కవిత్వంలో కథా కావ్యాలు రావాలని కుందుర్తి వాదన, అవసరం లేదని తిలక్ ఆవేదన. కుందుర్తి ఎంత ఆధునికుడై నప్పటికీ ,ఆయన లోపల ఒక వేదన వుండేది. ఇప్పుడు వచ్చిన ఆధునిక కవితాన్ని అంతటినీ , వయాకరనుల చేత ,పండితుల చేత ,ఆలంకారిక శాస్త్రజ్ఞుల చేత మెప్పించాలానే ఆరాటం. "మెచ్చ నంటావు నీవు, మెచ్చకుంటే మించి పోయే ,కొయ్య బొమ్మలే మెచ్చు " అని గురజాడ చెప్పినట్లుగా ,ఎవరు మెచ్చినా మెచ్చక పోయినా ఈ ప్రవాహం ఆగదు. ఈ విషయం కుందుర్తి కి తాను జీవించిన కాలంలో తెలియ లేదు.

అనుభూతి

అనుభూతి అంటే కొంత మందికి ఒంటి మీద గొంగళి పురుగులు పాకినట్టు వుంటుంది. అనుభూతి అంటే బ్రహ్మ పదార్ధం కాదు . కవిత్వం లో అనుభూతి వాదానికి వ్యతిరేకంగా చాలా మంది వున్నారు. ఇదే విషయం లో ఇంద్రగంటి కి ,కే.వి.అర్ కి మధ్య గతంలో కొన్ని దస్తాలు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అనుభూతిని వైయుక్తక మైనటువంటి దానిగా మనం సంకుచిత పరచనక్కర లేదు. ఒక బలవంతుడు ,బాగా బలహీనుడిని కొడుతున్నాడను కొండి . మనం అందరం చూస్తున్నా ఒకే రకంగా స్పందిం చము . ఒకరు చాలా తీవ్రంగా స్పందిస్తారు. ఒకరు మనకెందుకులే పొమ్మను కుంటాడు. ఒకరు ఇంకా కొట్టాలి ఈ మాత్రం చాలదు అనుకుంటారు . ఈ అనుభూతులు దేని మీద ఆధారపడి వుంటాయి ?
ఈ ప్రపంచం లో జీవించే ప్రతి వ్యక్తీ కూడ తనకు తెలిసో తెలవకో ఒక వర్గ స్వభావాన్ని కలిగి వుంటాడు. అది మెలకువ లో నయినా కావచ్చు ,సుషుప్తి లోనయినా కావచ్చు. లేకపోతె ఆ వర్గ స్వభావం అతనికి స్పష్టంగా తెలిసి వుండక పోవచ్చ్చు . వర్గ స్వభావం లేకుండా రచన చేయటం, వర్గ స్వభావం లేకుండా పటనాన్ని కొనసాగించటం అనేది ఇంతవరకు ఎవరకూ చిక్కు పడని విషయం.
పైన చెప్పినట్టు బలం ఉన్నవాడు బలహీనుడిని కొడుతున్నాడు . బలం అనేది ఒక గుర్తు. బలం అనేది రకరకాలు గా ఉండ వచ్చు. ఒక్క శారీరకమే కాదు. సమర్థించే వాడు ఎందుకు సమర్తిస్తున్నాడు . మనకెందుకు ,ఇంకా కొట్టాలి అనే రకాలుగా అనుకుంటున్నాడు? ఇక్కడ విమర్శ వచ్చేసరికి కేవలం అలంకార శాస్త్రాలు చాలవు . అలంకార శాస్త్రం ఒక్కటే ఎందుకు చాలదంటే , మనం లేచింది మొదలు మన చుట్టూ వున్న జీవితం ,మన జీవితం ,మన నరాల ఇంపల్స్,జీవితమ్ లో వున్న అనేక సంగతులు . మనల్ని ప్రభావితం చేస్తున్న మార్గాలు,మన మానసికమైన కారణాలు ,ఇవన్ని కూడ మన అనుభూతి మీద పని చేస్తాయి. పై సంఘటన తీసుకుంటే,అసలు ఎందుకు కొట్టాలి వాడ్ని అన్యాయంగా అని ఒకరు చాల ఊగి పోతారు, దీనికి అతని కారణాలు అతనికి వుంటై . ఇంకా కొట్టాలి వెధవని అనుకునేవారు వుంటారు,దీనికి ఇతని కారణాలు ఇతని కుంటాయి . కొడితే కొట్టనియ్లే మన కెందుకు? మనని కాదుగా కొట్టేది అనుకుని వెళ్లి పోఎవాడికి ,వాడి కారణాలు వాడి కుంటాయి . ఈ ప్రవర్తన లన్నింటినీ ఊరికినే తప్పుకు పోవటం అన కూడదు. పుట్టినప్పటి నుండి కూడ అతని పెరుగుదలలో ,పెరుగుతున్న విధానంలో,ప్రభావితం చేస్తున్నటువంటి కారణాలు అవుతాయి.
పై సంఘటన వస్తువుగా ఒకరు కవిత్వం రాసాడను కుందాం ,రెండవ రకం చదివే వాడు ,ఆ ..ఇది చెత్త కవిత్వం అని తేల్చి పారేస్తాడు. ఇంకొకరు మొదటి రకం మనస్తత్వాన్ని ఆధారం చేసుకున్న్నవాడు ,ఇదే కవిత్వాన్ని తీవ్రంగా అనుభవిస్తాడు. అందువల్ల రాసినవాడికి ,చదివిన వాడికి కూడ ఒకే రకమైన దృక్పథం వుండాలి.
కవిత్వం రాసేవాడు ఎ దృక్పథంతో నయితే రాస్తాడో ,చదివేవాడు కూడ అదే రకమయిన దృక్పథం తో చదవటం వల్లనే ఆ కవిత్వం అద్భుతంగా కనిపిస్తుంది .
ఈ రకమైన మానసిక కారణాల అంతరం వల్ల విశ్వనాధ ని హృదయ పూర్వకంగా మెచ్చుకున్న వాడు ,త్రిపురనేని ని మెచ్చుకోడు ,అలాగే త్రిపురనేని మెచ్చుకున్న వాడు విశ్వనాధ ని మెచ్చుకోడు. విశ్వనాధ వారన్నట్టు ఎవరి జీవలక్షణం వారిది.

Tuesday, May 11, 2010

లయ-నా పెళ్లి తరవాత సన్నివేశం

లయ సీరియల్ లో

ఎట్టకేలకు నా(వెంకట్రావు) పెళ్లి ,ఆజాద్ (మాధవయ్య ) చేస్తాడు.
అప్పటివరకు మామూలు దుస్తులు ధరించే నేను పెళ్లి తరవాత ఇన్ షర్ట్ చేయడం మొదలు పెడతాను .
అసలు పెళ్లి చూపుల దగ్గర నుంచే
ఇన్ షర్ట్ చేయటం మొదలు పెడతా ననుకోండి .
ఒక సారి ఆజాద్ ను చూడకుండా వెళుతుంటే ,నన్ను పిలుస్తాడు .
నేను
తండ్రి ని కాబోతున్నానని చెప్పటం,అతని ప్రతిస్పందన చూడండి.






Tuesday, May 4, 2010

పగటి వేషాలు-శక్తి వేషం-వీడియో

జానపద కళలలోపగటి వేషాలకు ప్రత్యేకత వుంది. అందులో శక్తి వేషానికి సంబందించిన చిన్న వీడియో చూడండి . మిగతా వేషాలకు సంబందించిన చిన్న చిన్న వీడియో లు కూడ నా దగ్గర వున్నాయి. పోస్ట్ చేస్తాను .



Tuesday, April 27, 2010

గుడివాడ నాటక రంగం గురించి 'ఆకాశవాణి,విజయవాడ కేంద్రం ' నుండి నా ప్రసంగాల ధారావాహిక -1

కృష్ణా జిల్లా "గుడివాడ" నాటక రంగ చరిత్ర గురించిన సమాచారాన్ని ఆకాశవాణి ,విజయవాడ కేంద్రం నుండి ప్రసంగించాను .ఆ ప్రసంగాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను . వినండి . ఇది మొదటి భాగం-ఐదు నిమిషాలు. మొత్తం ఒక గంట వుంది. మిగిలినది తరువాత పోస్ట్ చేస్తాను . వీడియో చేసి పోస్ట్ చేయడం వల్ల సౌలభ్యం ఉంటుందని భావించాను . మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తూ ..........తాతా రమేశ్ బాబు