My Blog List

Tuesday, December 27, 2011

వ్యర్థానికో అర్థం

వ్యర్థానికో అర్థం 
              ప్రత్యేక సందర్భాల్లో ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలపటం మన సంస్కృతి . మూడు రోజుల్లో రాబోయే నూతన సంవత్సరానికి వినూత్నంగా  శుభాకాంక్షలు తెలపటానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వ్యర్థంగా పారవేసే వాటితో అందంగా గ్రీటింగ్స్ తయారుచేస్తే..... పైసా ఖర్చు లేకుండా ..... మనకు తృప్తి  .. అందుకున్నవారికి సంతృప్తి  కదా!
              మరీ ముఖ్యంగా ఆ కార్డులను తయారు చేయటానికి ఉపయోగించే నూతనత్వం , తీసుకున్న వారు పొందే ఆనందం -వెరసి ఇరువురి మధ్య 'అనుబంధం ' పదిలమవుతుంది కదా!
               ఉదాహరణకి 
               సాధారణంగా  పెన్సిల్ చెక్కిన తరువాత ఆ చెక్కుడును పారవేస్తాం . కానీ ఆ వ్యర్థం తో అందమైన గ్రీటింగ్ తయారు చేస్తే ,పై విధంగా వుంటుంది.
                ఇలా చేయటానికి చిత్రకరులే కానవసరం లేదు కుడా . నీటి రంగులు తీసుకుని  ఒక్కో రంగు మీద చూపుడు వేలు తో అద్ది .... ఆ రంగును పువ్వు ఆకారం లో అద్దితే  . అందమైన చిత్రం .
                రకరకాల రంగుల ముఖమల్ పేపర్  ముక్కలను ఒక పద్దతిలో పేర్చితే మరో బొమ్మ 
                 కత్తిరించి పారవేసే ఎలాంటి కాగితాలను అయినా ,ఒకే రంగు కాగితాన్ని ఆయినా ....పారవేసే  నోట్స్ అట్ట పైన  అంటిస్తే ........
                వార్త పత్రికలలో ముద్రించిన 'పువ్వు' బొమ్మను కత్తిరించి ,ఒక  కాగితం మీద పెట్టి ఆ బొమ్మ అంచుల మీద పెన్సిల్ తో రుద్ది ,చూపుడు వేలితో కాగితం మీదకు రాసి , కత్తిరించిన పువ్వు బొమ్మను తెసివేస్తే  మరో సృజన.
                 మనం నిత్యం పారవేసే రకరకాల అట్టలను కత్తిరించి అంటిస్తే . ఆ తరవాత స్కెచ్  పెన్తో  తీర్చి దిద్దితే !ఒక నవ్వుల బొమ్మ .
                 వ్యర్థ కాగితాన్ని తీసుకొని రంగులు చల్లి , మధ్యకు మడతవేసి తీస్తే, చిత్ర విచిత్రమైన ఆకారాలు పరచు కొంటాయి . వాటిని సీతాకోక చిలుక లాంటి ఆకారాలలో కత్తిరించి ,వివిధ కొలతలతో పేరిస్తే .....
                 ఇలా ఎన్నయినా చేయవచ్చు. మనలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి  అబ్బుర  పడనువచ్చు.ఆత్మీయులను ఆనందంలో ముంచవచ్చు.
                 నవ్యతతో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించటానికి కాస్త తీరిక చేసుకొందమా !   






 

Saturday, December 24, 2011

త్రిపురనేని మహారధి జ్ఞాపకాలు నా కవిత్వ నేపధ్యం లో

2007 సం.లో విజయవాడ లో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహకులలో ఒకడిగాఎంతో మంది లబ్ధ ప్రతిష్టులతో మాట్లాడటం , మరెంతో మంది నిర్వాహకుడిగా, కవిగా గుర్తించటం జరిగింది. అక్కడే 'మహారధి' గారితో వ్యక్తిగతంగా నాకు పరిచయ మయినది. నాది గుడివాడ అనగానే దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు . తరవాత అప్పుడప్పుడు ఫోనులో మాట్లాడుకునే వాళ్ళం . నేను రాసిన 'నా దేశం ' దీర్ఘ కవిత పంపాను. అది చదివీ బహుళ ఆశీస్సులు ఇస్తూ, ద్వితీయ భాగాన్ని రాయమని ,అందుకు అవసరమయిన స్ఫూర్తి కొరకు ధ్యానం చేయమని రాసారు. వ్రాత ప్రతిని పంపితే తానే ముందుమాట రాస్తానని కూడా రాసారు. ఇంతలోనే ఆయన మృతి చెందటం నాకుతీరని లోటు.
'నా దేశం ' దీర్ఘ కవితలో 'త్రిపురనేని మహారధి' గారు స్పందించిన తీరు చదవండి.

'నీరసంగా గుంపులు గుంపులు గా
నుదుట పట్టిన చెమట బిందువులో
సూర్యుడు '
మహారధి : గొప్ప భావం , శ్రమశక్తి కి పట్టాభి షేకం
'రా మిత్రమా,
కరిగిపోయిన జ్ఞాపకాలను త్రవ్వు కుంటూ
శ్రమించిన
స్పర్శలో ఊరడింపును వెతుక్కుందాం
రా నేస్తమా
ఒకానొక అణచరాని సామాజిక కసిలో
విరిగిపోయిన అవయవాలను అతికించుకుంటూ
ధైర్యాన్నిచ్చిన
జీవితానికి కృతజ్ఞత చెప్పుకుందాం
రా దోస్త్
ఒకానొక రస్తాపై రేగిన అలజడిలో
సమకాలీనతను సాధించుకుంటూ
చైతన్యాన్ని
భవిష్యత్తుకు బహుమతిగా ఇద్దాం
రా కామ్రేడ్
ఒకానొక కొలిమిలో మండిన ఇనుములా
దగ్ధమై
ఆయుధంగా మారిపోయే
ఉద్యమాన్ని ఆహ్వానిద్దాం'
మహారధి : ఓహో ! ఇక్కడ ఆరంభ మైంది మహత్తర ఆశావహ దృక్పధం . ఇది విప్లవాగ్ని
'బడిని చూస్తే
ఆటపాటల అందాల తోటలై
నవ్వుల కేరింతల రంగుల హరివిల్లులై
విజ్ఞాన వికాసాల అంతరిక్షం లో విహరిస్తూ
చెంగున దూకే బాల్యం ఉంటుందనుకున్నా
.............................................................
ఇప్పుడు
బడిని చూస్తుంటే
మోయలేని భారాన్ని భుజాలకెత్తుకొని
నడుము వంగి శక్తులుడిగిన
వెట్టి చాకిరీల వృద్ధాప్యం ఉంది '
మహారధి : కళలు కనే కాలం యోధుడా ! నీ కలల బరువుని కాలమే మోస్తున్నది.
' ఒక ధాన్యపు గింజను విత్తి
వంద గింజలను పండించటమే
ప్రతి సృష్టి
ఒక నిజాన్ని ఎలుగెత్తి
వంద నిజాలను నినదించటమే
పోరాటం '
మహారధి : శెభాష్ ! ప్రకృతి సత్యాన్ని ఆవిష్కరించావ్ : అద్భుతం -
' అక్షరాన్ని మీటినా
చెదిరిన జీవన గమ్యమై
ఒక దుఖ్ఖాన్ని ఆలపిస్తుంది'
మహారధి : అందని ఆకాశాన్నే కాదు అడుగు లేని పాతాళాన్ని కూడా దర్శించావ్
'మౌన పోరాటాలతో తడారిన మనసు
చెరిగిన విశ్వాసమై పగుళ్ళిస్తుంది
నువ్విదే సరైన దారనుకుని
వెర్రిగా ఓడిపోవటానికి అలవాటు పడతావు '
మహారధి : బలహీన వర్గాల బలహీనపు ఆలోచనలకు అద్దం
"పగుళ్ళని పద్యాలతో అతికిస్తు "
మహారధి : ఆఖరి శ్వాస వరకూ ఇలాగే అతికించు
'బాబూ నాయనా.....
నువ్వూ మనిషి వేగా
అమ్మానాన్నలకు పుట్టినోడివేగా
తల్లి పాలను తాగి ఎదిగిన నీ నాలుకను
రెండుగా చీల్చి విష నర్తనం చేయిస్తావేం
బాల్యంలో లేని కాఠిన్యాన్ని
మొఖానికి వికృతంగా పులుము కుంటావేం ?
నీచానికయినా దిగజారే మృగత్వాన్ని
శరీరానికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తావేం'
మహారధి : అబ్బ! ఎంత కసి ! ఇదే కావాలి కవికి
'రాత్రంతా బీటు వేసిన వెన్నెల నేత్రాలు
చింత నిప్పులై ఉదయాన మొలుచు కొచ్చినప్పుడు
ఒక దుఖాన్ని దిగమింగుకొని
పెదాలపై పలవరించే భవిష్యత్ స్వప్నాలను
నిజం చేసుకో '
మహారధి : శ్రీ శ్రీ గడపిన నిద్ర లేని రాత్రులా ?
'నిజం దర్శించలేని ఇజం
నీలో లేకపోతే
కోపం సంతోషం బాధ
స్పందన ప్రదర్శించలేనితనం
నీలో ఇంకి పోతే
మళ్లీ
తల్లి గర్భం లోకి ప్రయాణించు
తొమ్మిది మసాల చైతన్యాన్ని
తనివి తీరా అనుభవించు '
మహారధి : వాహ్ ! నవ్యత్వానికి నాంది . ఎంత హుందాగా ఉండాలో గొప్పగా చెప్పావ్ !


'