My Blog List

Tuesday, December 7, 2010

బుడబుక్కల వేషం(పగటి వేషాలు)

బుడబుక్కల వేషం
'బుడ....బుడ.... బుడబుడ.....బుడబుక్...'
అనే ఢమరుక శబ్దం ,మధ్యలో ఘంటా నాదం,గంభీరమయిన కంటఃస్వరం తో ........
రాగ యుక్త కీర్తనల తో ......'

ఆ ప్రదేశం గ్రామమే ! ఆ కాలం సంక్రాంతి కాలమే!
ఆ వచ్చింది బుడబుక్కల వారే!
పండిన పంటలతో గ్రామాలలో ఇళ్ళు కళకళలాడాలని , గ్రామం సుభిక్షంగా వుండాలని, ఆశిస్తారు బుడబుక్కల వారు.అలాగే బుడబుక్కల వారు తమ గ్రామానికి వస్తే శుభప్రదమని భావిస్తారు పల్లెవాసులు.
చేతిలో ఢమరుకం ,నడుముకు ఘంట ,భుజాన జోలె, నల్ల కోటు వేసుకుని ఆపై శాలువా ధరించి,ఎర్రని తలపాగా చుట్టుకొని ,నల్లటి గొడుగు తో కనిపిస్తారు బుడబుక్కల వారు.తెల్ల వారు ఝామునే భిక్షాటన ముగించాలనేది వీరి సాంప్రదాయం.
పల్లెల్లో ఇల్లాళ్ళు తెల్లవారు ఝామునే లేచి ,వాకిట్లో కళ్లాపి జల్లి ,అందమైన ముగ్గులతో అలంకరించే వేళ
'అంబ పల్కు..జగదంబ పల్కు..' అంటూ వచ్చే బుడబుక్కల వారి ఆశిస్సులు తీసుకుని, భిక్ష వేస్తారు .మగవాళ్ళు గేదలదగ్గర శుభ్రం చేస్తూ , పండిన పంట తాలూకు ఆలోచనలు చెస్తూ ,చేయబోయే పనుల గురించి ,ఇంటికి కావలసిన అవసరాల గురించి ,కొనబోయే వస్తువుల గురించి,కొత్త అల్లుళ్ళ గురించి ....రకరకాల పధకాలు వేస్తూ వుంటారు.
తాము వచ్చిన ప్రదేశం లో ఏ వైపు ఈతి భాదలు వుంటాయో చెప్పి,నివారణ ఉపాయాలు ప్రజలకు తెలియ చేసి ధైర్యం చెపుతూ ముందుకు సాగుతారు బుడబుక్కల వారు. ఇది వీరి కుల వృత్తి . వీరి కులం 'బుడబుక్కల' . వీరు సంచార జీవులు. ఏ గ్రామం వెళితే ,అ గ్రామ కుమ్మరుల ఇళ్ళ దగ్గరే ఉండి, భోజనం కూడా వాళ్ళ దగ్గరే చేస్తారు. సంచార జీవులైన వీరిని ఎస్టీ లలో కలప లేదు ప్రభుత్వం.
స్వాతంత్రానికి పూర్వం జమిందార్లు వీరికి భూములు ఇచ్చారు. సంక్రాంతి రోజులలో మూడు నెలలు యాచించగా వచ్చిన ధాన్యం తో జోలె నిండి పోయేది. అలా మూడు నెలల యాచనను, ఎడ్ల బండి కెత్తుకుని వెళ్ళేవారు. క్రమక్రమంగా రైతు పరిస్థితి దిగజారడంతో ,యాచన లేక భుక్తి గడవటం ఇబ్బందిగా ఉండి,కుల వ్రుత్తి ని పక్కన పెట్టి కూలీలుగా,పాట బట్టలు అమ్మే వారుగా కాలం గడుపుతున్నారు.
మన రాష్ట్రం లో వీరి సమాఖ్య పడి లక్షలకు పైగానే వుంది. కాని వీరికి రాజకీయాలలో ప్రాతినిధ్యం లేదు.అనంత పురం,జహీరాబాద్,ఆమ్తోల్,కరీంనగర్,వరంగల్ జిల్లా లలో ,ఖమ్మం అన్ని మండలాలలో వీరు ఎక్కువగా వున్నారు. 'బుడబుక్కల కబుర్లోద్దు',ఒరే బుడబుక్కలోడా','వీడొక బుడబుక్కలోడు' లాంటి పిలుపులతో తక్కువ భావం తో తిట్టుగా మారిన వీరి కులం పేరు మార్చాలని ప్రయత్నం జరుగుతోంది. ఖమ్మం ప్రాంతాల వారు,'రాజ క్షతియ','జ్ఞానేశ్వర్' అనే పేర్లు సూచించారు. వీరికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సాయాలు అందాలని బుడబుక్కల సంఘం అధ్యక్షుడు,చంద్ర శేఖర్, యుత్ వెల్ ఫేర్ ప్రసిడెంట్ రాములు కృషి చేస్తున్నారు.



పగటి వేషాల వారి ప్రదర్శన





పగటి వేషాల వారు బుడబుక్కల వేషాన్ని కాదు రమ్యం గా ప్రదర్శిస్తారు . ఢ మరుకం 'బుడబుడ...' అంటుంది కాబట్టి వీరు ఈ వేషాన్ని బుడ బుడకల వేషం అని పిలుస్తారు. ఈ వేషాన్ని ఇద్దరు,లేక ఐదుగురు ప్రదర్శిస్తారు. అమ్దరికీ సంప్రదాయక వస్త్రాలుం టాయి . పంచే ,లాల్చీ,లాయరు కోటు,పైన శాలువా,పెద్దపెద్ద మీసాలు పెట్టుకుంటారు. నుదుటన పసుపు బొట్లు అడ్డంగా పెట్టి ,ఆపైన ఎరుపు బొట్టు రూపాయి బిల్లంత సైజు పెట్టుకొని,గడ్డం మీద నుండి తల పైకి వచ్చేట్లుగా ఎర్ర రంగు గుడ్డ చుట్టూ కుంటారు. మేడలో రుద్రాక్ష మాలలు,చేతికి కడియాలు,కాలికి గగ్గేరలు తొడుక్కుం టారు. ఇంతకు ముందు గ్రామ పెద్దలు బహుకరించిన సింహ తలాటాలు,మెడల్స్ తో అలంకరించు కుంటారు. ఘంటా కంకణం ,మకర కుండలాలు ధరించి గ్రామం లోకి అడుగు పెడతారు.
ముందుగా ఆ వూరి పోలేరమ్మను ,ఆ వూరి పెద్దలను అందరిని తలచుకొని ,అక్కడ 'వురికట్టు ' ఏర్పాటు చేసుకొంటారు. అమ్మవారికి మ్రొక్కి ,ప్రార్థించి ,కోడిని బలి ఇచ్చి ,ఈ వేషాన్ని ఊరంతా ప్రదర్శిస్తారు. ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టి మధ్యాన్నం రెండు గంటల దాకా ప్రదర్శిస్తారు. ఐదుగురు వేష గాళ్ళ లో ఒకరు బుడబుక్ వాయిస్తే, ఒకరు చేతిలో గజ్జెలు,ఒకరు గంట,ఒకరు డప్పు,మరొకరి చేతిలో భిక్ష పాత్ర వుంటుంది.
' అంబ రావే...జగ డంబ రావే.... -బుడబుక్
కంబ కంటిని .... కాళి రావే ....-బుడబుక్ '
అయ్యలారా...అమ్మలారా... ఈ రోజు వేషం బుడబుక్కలు. బుడబుక్కలు చెప్పే మాటలు దేవతలా ముచ్చట్లు .
' కాశి విశాలాక్షి పల్కు ...కంచి కామాక్షి పల్కు...-బుడబుక్
కలకత్తా కాళి పల్కు.....మధుర మీనాక్షి పల్కు...-బుడబుక్
ఆ కొండపై వెలసిన విజయవాడ దుర్గమ్మ పల్కు...'

మేం ఇప్పుడు పుట్టినోల్లం కాదు మారాజా. " కృతయుగం లో శ్రీ హరి బుడబుక్కల వాని ఏసం ఏసి శివునికి త్రిపురసురల సంహరించే ఉపాయం జోస్యం చెప్పినాడు మారాజ్ ! త్రేతాయుగం లో డంభికాసురుడనే రాక్ష సుడిని చంపి వాని డింభం డోలక ఢ మరుకం చేసి ,వాని నరము తాళ్ళుగా,చర్మం మూతలుగ, చేసి బుడబుక్కల వాని వేషం లో వచ్చి ,సూర్య వంశం గురించి చెప్పి ,ఢ మరుకం వాయించిన మేము ఇప్పుడు ఇల్లిల్లు తిరిగి దీవిచి పోతున్నాం మా రాజ్ . త్రేతాయుగంలో దశరద మహారాజు సంతానం లేకుండా చింతిస్తున్న సమయం లో శ్రీ మహా విష్ణువు ,బాగా యాలోచన చేసి ,రఘు వంశం ఇంతటితో ఆగి పోరాదు,దశరధుని నిరాశను ఆశ గా చిగురింప చేయాలని ఒక రోజు బుడ బుక్కల వాని వేషం లో వచ్చి.......' రాజా,రాజాధిరాజ ,రాజ మార్తండ, రవి కల్ప భోజ ,రాజ,నీకు భవిష్యత్తు చాల ఉండ్య. సంతానం లేదని చింత పద వద్దు. నువ్వు వీరుడివి,శురిడివి, అమాత్యుడివి, కాబట్టి నీకు పుత్ర సంతానం కావాలనే ఆలోచన వుంది. అందుకు చక్కని పధకం చెబుతాను విను' అన్నాడు. అంతవరకు ఎంతో చింతిస్తున్న దశరధుడు నిరస నిస్పృహలను వదలి పెట్టి ,భవిష్యత్తు మీద ఆలోచనతో ,ఆశతో 'చెప్పండి' అన్నాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు 'పుత్రకామేష్టి' యాగాన్ని చేస్తే, తప్పకుండా నీకు పుత్రులు జన్మిస్తారు'అని చెప్పాడు. అలా పుట్టిన మేము ఇప్పడు గ్రామా గ్రామాన తిరిగి మంచి విషయాలు,దేవతలా ముచ్చట్లు తెలుపుతూ వుంటం.
తమ వంటి దాతలు ఉన్నంత కాలం ఈ దేశానికి ,ఈ భూమికి మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం మా సేతు గారికి లక్షల లక్షల లాభం కలిగి ,శుభోజ్జయం కలిగి,బుడబుక్క ల వారి ఆశీస్సులు గలిగి ,...ఎల్లప్పుడూ జయాన్ని పొందాలి....జయీ భవ..... విజయీ భవ.... దిగ్విజయీ భవ .......
'అంబ పల్కు...జగదంబ పల్కు.....-బుడబుక్
బంబర వేణి పల్కు....బకల ముఖి పల్కు....-బుడబుక్ '





సామాజిక అంశం:


వ్యవసాయంలో పంట దిగుబడి తగ్గి బాధ పడే రైతులు ,అనేక సమస్యలతో నిరాశ చెంది జీవితంపై విరక్తి చెందుతున్నారు .


ఆర్థికంగా ,శారీరకంగా,మానసికంగా, బాధలలో ఉన్న వారందరిని నిరాశకు లోను కావద్దు, భవిష్యత్తు లో బాగుంటుందని చిగురించే ఆశలు కలిగిస్తున్నారు ఈ వేషం ద్వారా . ప్రస్తుతం బాధల నుండి విముక్తి పొందటానికి చేయవలసిన పనుల గురించి ఆలోచించి,ఆచరణలో పెట్టటమే తక్షణ మార్గం , పరిష్కారమని ప్రజలకు చెప్తారు.


విజయం సాధించాలంటే అసంతృప్తి ,అసహనం,మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి .సమాజంలో అన్ని వర్గాలతో సత్సంబందాలు నెలకొల్పుకోవటం ద్వారా ,సానుకూల దృక్పధాన్ని అలవరచి కోవాలి. పరిపరి విధాల పోయే మనసును సానుకూల దృక్పధం వైపుకు మరల్చమని చెప్పేదే ఈ వేషం .
నేడు ప్రజలకు భవిష్యత్ మీద నమ్మకం కలిగించే మాటలు చెప్పటానికి మానసిక వైద్యులు ,సానుకూల ఆలోచన తరగతులు నిర్వహించే వారు కృషి చేస్తున్నారు.





-తాతా రమేశ్ బాబు,
గౌరవ అధ్యక్షులు : కళా భారతి,
సాంప్రదాయ జానపద కళాకారుల సంక్షేమ సంఘం ,రిజి.429 /2009
బిళ్ళపాడు